ఇంఫాల్, ఆగస్టు 27: మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. రాజధాని ఇంఫాల్ నడిబొడ్డున న్యూ లాంబులేన్ వద్ద దుండగులు మూడు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పేశారు. ఈ ఘటనపై స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొద్ది గంటలపాటు అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదిలా ఉండగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి నివాసం వద్ద కాపలాగా ఉన్న భద్రతా బలగాల వద్ద నుంచి ఆయుధాల్ని లాక్కెళ్లారు. వాటిలో ఏకే 47 రైఫిల్స్ కూడా ఉన్నాయని తెలిసింది. దుండగులను పట్టుకొనేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్టు స్థానిక పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.