Wolf killed : ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లాలో పలు గ్రామాల ప్రజలను వణికిస్తున్న ఆరో తోడేలును ఎట్టకేలకు గ్రామస్థులు మట్టుపెట్టారు. బహ్రెయిచ్ జిల్లాలోని తమాచ్పుర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మేకను వేటాడేందుకు వచ్చిన తోడేలును గ్రామస్థులు కొట్టి చంపినట్లు అధికారులు తెలిపారు. తోడేలు హతం వార్త తెలియడంతో గత కొన్నాళ్లుగా భయంతో వణికిపోయిన పలు గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
‘చాలా రోజులుగా మా డిపార్ట్ బృందాలు చివరి తోడేలును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ గ్రామంలో జంతువు కళేబరం పడి ఉందనే సమాచారం అందడంతో మా టీమ్ అక్కడికి వెళ్లింది. ఘటనా స్థలంలో మృతి చెందిన తోడేలు కనిపించింది. దాని శరీరంపై గాయాలున్నాయి. గ్రామస్థులే దాన్ని చంపి ఉంటారని మేం అనుమానిస్తున్నాం’ అని అటవీశాఖ అధికారి వెల్లడించారు.
మహసి ప్రాంతంలో ఈ ఏడాది మార్చి నుంచి తోడేళ్లు వరుసగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. మొత్తం ఆరు తోడేళ్ల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాంతో ‘ఆపరేషన్ ఖేడియా’ను ప్రారంభించారు. ఉచ్చులు, బోన్లు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్ల సాయంతో నిఘా వేశారు. అవి ఎప్పటికప్పుడు స్థావరాలను మార్చుకుంటూ వచ్చాయి.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీచేశారు. తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్చేయాలని ఆదేశించారు. కానీ అధికారులు త్వరలోనే నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. ఐదో తోడేలును గత నెల 10న పట్టుకున్నారు. చివరి తోడేలు కోసం గాలింపు కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఆ తేడేలును గ్రామస్తులు కొట్టిచంపారు.