తిరుపతి: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియతో డూప్లికేట్ ఓట్లను తొలగించడం న్యాయ సమ్మతమైన అంశమే అని రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి(Vijay Sai Reddy) అన్నారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించడాన్ని ఆయన సమర్ధించారు. ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో లేదా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండడం కరెక్టు కాదన్నారు. అలాంటి ఓట్లను తొలగించడాన్ని ఆయన స్వాగతించారు. తిరుపతిలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పేర్ల విషయంలో స్వల్ప తప్పులతో డూప్లికేట్ ఎంట్రీలు అవుతున్న వాటిని గుర్తించి, అలాంటి పేర్లను కూడా తొలగించాలని ఆయన అన్నారు.
భారతీయ పౌరసత్వం లేకుండా ఆధార్ కార్డులు పొంది, దానితో ఓటర్గా రిజిస్టర్ చేసుకున్న విదేశీయుల ఓట్లను కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని విజయసాయి రెడ్డి అన్నారు. స్వచ్ఛమైన భారతీయ పౌరల ఓట్లను తొలగించడం సాధ్యం కాదు అని ఆయన పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో తప్పులు జరగనంత వరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిందించవద్దు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసినంత మాత్రాన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాల్సిన అవసరం లేదన్నారు.