కరూర్: ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తమిళనాడులోని కరూర్‌లో శనివారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సుమారు లక్ష మందికి పైగా కిక్కిరిసిన సభలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 38 మందికి పైగా మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ఈ దుర్ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. 400 మందికి పైగా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని పోలీస్ అధికారి డేవిడ్సన్ దేవశిరావతం తెలిపారు. వీరిలో పార్టీ కార్యకర్తలు, మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారని చెప్నారు. విజయ్ రాక కోసం కార్యకర్తలు, అభిమానులు ఆరు గంటలకు పైగా ఎదురు చూస్తుండగా విజయ్ ఎట్టకేలకు ప్రత్యేక బస్‌లో వచ్చి దానిపై నుంచి ప్రసంగించడానికి ఉద్యుక్తుడు కావడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది.
విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో జనసమూహం పెద్దయెత్తున పెరిగిపోయి అదుపు తప్పింది. అప్పటికే వందలాది మంది గాయపడ్డారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కార్యకర్తలు నిర్వాహకులను అప్రమత్తం చేయడంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపారు. అయితే అన్ని వేల మంది జనాన్ని దాటుకుని అంబులెన్స్‌లు రావడం కష్టమైంది. గాయపడిన వారిని అతి కష్టం మీద దవాఖానలకు తరలించారు.
విషాద ఘటన అనంతరం కూడా విజయ్ ప్రసంగాన్ని కొనసాగించారు. కరూర్‌లో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామన్న డీఎంకే తర్వాత ఆ నెపాన్ని కేంద్రంపైనే తోసివేసిందని విజయ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయన తన పార్టీ డీఎంకే అగ్ర కుటుంబానికి ఏటీఎంగా పని చేశారని విజయ్ ఆరోపించారు. అక్రమార్జనను ఆ కుటుంబానికి ఇచ్చేవారన్నారు. బాలాజీని ‘10 రూపాయల మంత్రి’ అని వ్యంగ్యంగా అన్నారు. అంతకు ముందు పశ్చిమ కొంగు ప్రాంతంలో విజయ్ మాట్లాడుతూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు ఓటు వేయడం అంటే అది బీజేపీకే ఓటు వేసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే కుటుంబానికి బీజేపీతో అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే డీఎంకేకు ఓటు వేస్తే అది బీజేపీకే ఓటు వేసినట్టు అని పేర్కొన్నారు. టీవీకే సామాన్య ప్రజల గొంతుక అని అన్నారు.
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ శనివారం మధ్యాహ్నానికి కరూర్ చేరుకోవాల్సి ఉండగా ఆరు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. అప్పటికే లక్ష మందికి పైగా జనం అక్కడ విజయ్ కోసం వేచి చూస్తున్నారు. ఆ ప్రదేశం జనంతో కిక్కిరిసిపోవడంతో పలువురు అప్పటికే స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఓ 9 ఏండ్ల బాలిక కనిపించడం లేదని ఆ బాలిక కుటుంబ సభ్యులు రోదిస్తూ వెదకడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అభిమానులు విజయ్‌ని చూసేందుకు బస్సువైపుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.
అప్పటికే గంటల కొద్దీ ఎండలో వేచి ఉన్న ప్రజలను చూసి విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి బస్సుపై నుంచి వాటర్ బాటిల్స్‌ని వారిపైకి విసిరారు. బస్సు వైపు దూసుకురావడానికి అభిమానులు కొందరు ప్రయత్నించడంతో అక్కడ కూడా గందరగోళం ఏర్పడింది. జనాన్ని కంట్రోల్ చేయాలంటూ విజయ్ పదేపదే భద్రతా సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీస్ ప్లీజ్ హెల్ప్ అంటూ విజయ్ పోలీసులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాటలో 30 మంది స్పృహ తప్పి పడిపోయారని అధికారులు తెలిపారు. అతి కష్టం మీద అంబులెన్సులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని దవాఖానలకు తరలించాయి.
కరూర్ తొక్కిసలాట విషాదంపై విజయ్ స్పందించారు. ‘నా హృదయం ముక్కలైంది. పదాలు వర్ణించలేని దుఃఖం, విచారంతో నేను విలవిల్లాడుతున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సోదర, సోదరీమణుల కుటుంబాలకు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.