Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(68) మృతి చెందారు. అయితే విజయ్ రూపానీ మృతి చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలోనే విజయ్ రూపానీ లండన్ బయల్దేరినట్లు బోర్డింగ్ పాస్ కూడా బయటకు వచ్చింది. అంతేకాకుండా విమానంలో ప్రమాదానికి ముందు ఓ వ్యక్తి విజయ్ రూపానీతో సెల్ఫీ దిగిన ఫొటో కూడా బయటకు వచ్చింది.
విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్‌కు 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆరు దశాబ్దాల క్రితం గుజరాత్ రెండో సీఎం బల్వంత్రాయ్ మెహతా కూడా ఇలాగే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 1965 సెప్టెంబర్‌లో, గుజరాత్ రెండో సీఎం బల్వంత్ రాయ్ మెహతా అహ్మదాబాద్ నుండి మిఠాపూర్కు విమానంలో ప్రయాణిస్తుండగా, ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళం ఆ విమానాన్ని కూల్చివేసింది. ఈ ప్రమాదంలో మెహతా భార్యతో పాటు సహాయకులు, ఒక జర్నలిస్టు కూడా ప్రాణాలు కోల్పోయారు.