ఆదివారం 24 జనవరి 2021
National - Dec 19, 2020 , 00:37:41

టీకా.. మీ ఇష్టం!

టీకా.. మీ ఇష్టం!

  • కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడంపై ఎవరికివారే నిర్ణయం తీసుకోవాలి
  • అయితే.. అందరూ వేసుకుంటేనే మంచిది
  • కావాల్సిన వాళ్లకు నమోదు తప్పనిసరి
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18: దేశ ప్రజలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్‌-19 టీకాను వేసుకోవడం స్వచ్ఛందమేనని, ప్రజలు ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో టీకా సామర్థ్యంతో పోలిస్తే, భారత్‌లో వేసే టీకా ఏ మాత్రం తీసిపోలదని వెల్లడించింది. గతంలో కొవిడ్‌-19 బారిన పడనివారు కూడా వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకోవడం మంచిదని సలహానిచ్చింది. ఈ మేరకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీ, పనితీరుకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న కొన్ని ప్రశ్నలకు గురువారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానాలిచ్చింది. ఆ వివరాలు..

  • టీకా వేసుకోవడం అనేది ప్రజలకు తప్పనిసరి కాదు. అయితే, మహమ్మారి నుంచి సంపూర్ణ రక్షణ పొందేందుకు అందరూ టీకా డోసులు తీసుకోవడం మంచిది. 
  • త్వరలో వ్యాక్సిన్‌ పంపిణీని మొదలుపెడతాం. ప్రస్తుతం దేశంలో ఆరు కంపెనీల టీకాలు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయి. అవి 1.ఐసీఎంఆర్‌-భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ 2.జైడస్‌ కాడిలా టీకా 3.జెన్నోవా వ్యాక్సిన్‌ 4.ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా టీకా 5.డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌-గమలేయా స్పుత్నిక్‌ వీ టీకా 6. బయోలాజికల్‌ ఈ-ఎంఐటీ (అమెరికా) వ్యాక్సిన్‌.
  • వ్యాక్సిన్‌ సురక్షితమైనదని పూర్తిగా రుజువయ్యాకనే అందుబాటులోకి తీసుకువస్తాం. సాధారణంగా ఎలాంటి వ్యాక్సిన్‌ తీసుకున్నా కొద్దిపాటి జ్వరం, నొప్పి వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. టీకాకు సంబంధించిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనడానికి తగిన ఏర్పాట్లు, వైద్య సాయాన్ని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ర్టాలను ఆదేశించాం. 
  • క్యాన్సర్‌, మధుమేహం, బీపీ తదితర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్నవాళ్లు కూడా టీకాను తీసుకోవచ్చు. 28 రోజుల వ్యవధిలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాలి.

నమోదు తర్వాత ఎస్సెమ్మెస్‌ 

టీకా వేసుకోవాలనుకుంటున్నవారు కొవిడ్‌-19 కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వెబ్‌సైట్‌/యాప్‌లో వివరాలు నమోదు చేసుకొని రిజిస్టర్‌ అవ్వాలి. వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఒక ఎస్సెమ్మెస్‌ వస్తుంది. దాంట్లో టీకా వేసే ఆరోగ్య కేంద్రం, టీకా వేసే సమయం వంటి వివరాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఫొటోతో కూడిన ఏదైనా గుర్తింపు కార్డు సమర్పించాలి. (డ్రెవింగ్‌ లైసెన్స్‌, గ్రామీణ ఉపాధిహామీ పథకం ఉద్యోగ కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాసు పుస్తకం, పింఛన్‌ పత్రాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రైవేట్‌ సంస్థలు జారీ చేసే సర్వీస్‌ గుర్తింపు కార్డు, ఓటరు గుర్తింపు కార్డు  వీటిలో ఏదైనా ఒకటి)

ఎవరికి తొలి ప్రాధాన్యం?

వ్యాక్సిన్‌ డోసుల లభ్యతను బట్టి పంపిణీ జరుగుతుంది. వైరస్‌ నుంచి ఎక్కువ ప్రమాదం ఉన్న వారికే ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. కొవిడ్‌-19 రోగులకు చికిత్సను అందించే వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ పంపిణీలో తొలి ప్రాధాన్యం ఉంటుంది. టీకా లభ్యతను బట్టి 50 ఏండ్లు దాటిన వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు


logo