లక్నో: పోస్టింగ్ తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా చేశారు. పనిచేయడానికి తగిన అవకాశాలు ఇవ్వడం లేదని, తనను పక్కనపెట్టారని ఆరోపించారు. (Rinku Singh Rahi) ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహి, 2025 జూలైలో షాజహాన్‌పూర్ జిల్లా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన తొలి రోజు కాంపౌండ్ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న చెత్తాచెదారాన్ని, కొందరు వ్యక్తులు బహిరంగంగా మూత్రవిసర్జన చేయడాన్ని ఆయన గమనించారు.
కాగా, ఈ సందర్భంగా ఒక లాయర్‌తో రింకు సింగ్ రాహి గుంజీలు తీయించారు. ఈ బహిరంగ శిక్షపై న్యాయవాదులు నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఐఏఎస్ అధికారి ప్రయత్నించారు. నిరసన చేస్తున్న న్యాయవాదుల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పారు. అంతేగాక అధికారులకు కూడా బాధ్యత ఉన్నదంటూ తనకు తానే శిక్ష వేసుకుని గుంజీలు తీశారు.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహిని రెవెన్యూ కౌన్సిల్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. నాటి నుంచి రెవెన్యూ కౌన్సిల్‌కు అనుబంధంగా ఆయన పని చేస్తున్నారు. దీంతో తనను పక్కకుపెట్టారని, పనిచేయడానికి తగిన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. రాజ్యాంగ చట్రంతో పాటు ఒక ‘సమాంతర వ్యవస్థ’ కూడా పనిచేస్తున్నదని ఆయన ఆరోపించినట్లు తెలుస్తున్నది.
కాగా, రింకు సింగ్ రాహి గతంలో కూడా ధైర్యంగా, దూకుడుగా వ్యవహరించారు. 2009లో ముజఫర్‌నగర్‌లో సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేసినప్పుడు రూ. 83 కోట్ల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ వెంటనే ఆయనపై దాడితో పాటు పలుమార్లు కాల్పులు జరిగాయి. కాల్పుల నుంచి ఆయన ప్రాణాలతో బయపడినప్పటికీ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
అయినప్పటికీ, రింకు సింగ్ రాహి ప్రజాసేవలో కొనసాగారు. నిజాయితీ, దృఢ సంకల్పం గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన పలుసార్లు బదిలీ అయ్యారు. ఐఏఎస్‌లో చేరక ముందు, రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌లో ఆయన పనిచేశారు. సర్వీసులో ఉండగానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
Also Read:
Kidney Racket | రూ. 50,000 వివాదంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురు డాక్టర్లు అరెస్ట్
Watch: హైకోర్టు ముందు వాహనాలకు నిప్పంటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రాత్రివేళ ఇంటి గోడలు దూకి.. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి