వాషింగ్టన్: బిలియనీర్ గౌతం అదానీ(Gautam Adani), ఆయన కంపెనీలపై విచారణ చేపట్టేందుకు ఇటీవల అమెరికా సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముడుపులు చెల్లించిన కేసులో అమెరికా కోర్టు అదానీని నిలదీసింది. అయితే భారతీయ వ్యాపారిపై అమెరికా న్యాయశాఖ తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తప్పుపట్టారు. ఎంపిక చేసుకుని ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల.. భాగస్వామ్య దేశాలతో బంధాలు దెబ్బతింటాయని ఆ నేత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ బీ గార్లాండ్కు లేఖ రాశారు లాన్స్ గూడెన్.
విదేశీ వ్యక్తులను ఎంచుకుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని న్యాయశాఖను డిమాండ్ చేశారాయన. అదానీ విచారణ వెనుక ఏదైనా లోగుట్టు ఉన్నాదా అని, దీని వెనుక జార్జ్ సోరస్ లాంటి వ్యక్తి ఉన్నారా అని రిపబ్లికన్ నేత ప్రశ్నించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు బలమైన భాగస్వామిగా ఇండియా ఉన్నదని, టార్గెట్ చేసి చర్యలు తీసుకోవడం వల్ల భాగస్వామ్య కూటమి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలోని చెడు వ్యక్తులను ముందుగా అమెరికా న్యాయశాఖ శిక్షించాలని, విదేశీ వ్యక్తులను కాదు అని గూడెన్ పేర్కొన్నారు. వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెటి, అమెరికన్ల కోసం లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నవారిని టార్గెట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో అమెరికాకే నష్టం జరుగుతుందని గూడెన్ తన లేఖలో తెలిపారు.
ఒకవేళ అదానీపై ఆరోపణలు నిజమైనా, వాటిని నిరూపించినా, ఆ అంశంలో అమెరికా పాత్ర ఏముంటుందని గూడెన్ ప్రశ్నించారు. అదానీ సంస్థ భారత్లో అక్కడి అధికారులకు లంచాలు ఇచ్చిందని, ఓ భారతీయ కంపెనీ ఆ లావాదేవీలకు పాల్పడిందని, దీంట్లో అమెరికా వ్యక్తుల ప్రమేయం ఏమి ఉందని గూడెన్ తన లేఖలో తెలిపారు. అమెరికా వ్యక్తుల ప్రమేయం లేనప్పుడు.. విదేశీ వ్యక్తులను విచారించేందుకు న్యాయశాఖ ఎందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుందని ఆయన అడిగారు. అదానీ ముడుపుల కేసులో ఏ ఒక్క అమెరికా వ్యక్తి లేకపోవడం ఏంటని న్యాయశాఖను ప్రశ్నించారు.
ఇండియాలో అవినీతి జరిగితే, అదానీపై అమెరికాలో కేసు ఎందుకు రిజిస్టర్ చేసినట్లు న్యాయశాఖను నిలదీశారు. మీరేమైనా ఇండియాలో న్యాయం కోసం వత్తిడి తెస్తున్నారా అని అడిగారు. ఈ కేసులో నిమగ్నమైన భారతీయ అధికారులను అమెరికాకు రప్పిస్తారా అని ప్రశ్నించారు. ఒకవేళ అవినీతి అధికారుల్ని అప్పగించేందుకు భారత్ నిరాకరిస్తే, అప్పుడు అమెరికా న్యాయశాఖ వద్ద ఉన్న ఆప్షన్ ఏంటని అడిగారు. అమెరికా, భారత్ మధ్య చిచ్చు పెట్టి, బైడెన్ సర్కారు అదానీ కేసును అంతర్జాతీయం చేయాలని చూస్తున్నదా అని రిపబ్లికన్ నేత గూడెన్ ప్రశ్నించారు.