లక్నో: పోలీసుల ఎదుట ఒక వ్యక్తి (UP Man Surrenders) లొంగిపోయాడు. ఈ సందర్భంగా తాను లొంగిపోయేందుకు వచ్చానని, తనపై కాల్పులు జరుపవద్దంటూ రాసిన ఒక బోర్డును చేతిలో పట్టుకుని వచ్చాడు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహులి ఖోరీ గ్రామానికి చెందిన అమర్జిత్ చౌహాన్ అనే వ్యక్తి కొన్ని నెలల కిందట ఛాపియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 20న తన సహోద్యోగితో కలిసి బైక్పై వెళ్తుండగా ఒక వంతెన వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారని, గన్తో బెదిరించి బైక్, మొబైల్ ఫోన్లు, డబ్బులను దోచుకున్నారని ఆరోపించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంకిత్ వర్మ, మరో వ్యక్తిని నిందితులుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నారు. వారి అరెస్ట్ కోసం రూ.20,000 నగదు రివార్డును పోలీసులు ప్రకటించారు.
కాగా, ఆరు నెలలుగా పరారీలో ఉన్న నిందితుడు అంకిత్ వర్మ అనూహ్యంగా పోలీసులకు లొంగిపోయాడు. మంగళవారం స్వయంగా ఛాపియా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. ఈ సందర్భంగా ‘నేను లొంగిపోవడానికి వచ్చా. నన్ను కాల్చకండి’ అని రాసి ఉన్న పలకను మెడలో వేసుకున్నాడు. ఇది చూసి స్థానికులతోపాటు పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే నేరస్తులకు పోలీసులపై ఉన్న భయాన్ని ఈ సంఘటన నిరూపిస్తున్నదని, దీంతో వారు లొంగిపోతున్నారని పోలీస్ అధికారి తెలిపారు.