లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం ఇంగ్లీష్ పేపర్ లీక్ అయ్యింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు రెండో షిఫ్ట్‌లో ఈ పరీక్ష జరుగాల్సి ఉంది. అయితే బల్లియా జిల్లాలో ఇంగ్లీష్ పేపర్ లీక్ అయ్యింది. 316 ఈడీ నుంచి 316 ఈఎల్ సిరీస్ ఇంగ్లీష్ పశ్నాపత్రాలు లీక్ అయినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను రూ.500కు మార్కెట్లో అమ్ముతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో యూపీ ఇంటర్ బోర్డు స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంగ్లీష్ పశ్నాపత్రాలు లీక్ అయిన ఈ సిరీస్‌కు సంబంధించిన 24 జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం జరుగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేసింది. మిగతా జిల్లాల్లో ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారి తెలిపారు.
కాగా, పేపర్ లీక్ కారణంగా ఆగ్రా, మెయిన్‌పురి, మధుర, అలీఘడ్, ఘజియాబాద్, బాగ్పత్, బదౌన్, షాజహాన్‌పూర్, ఉన్నావ్, సీతాపూర్, లలిత్పూర్, మహోబా, జలౌన్, చిత్రకూట్, అంబేద్కర్‌నగర్, ప్రతాప్‌గఢ్, గోండా, గోరఖ్‌పూర్, అజంగర్పూర్, బల్లియా, వారణాసి, కాన్పూర్ దేహత్, ఎటా, షామ్లీ జిల్లాల్లో బుధవారం జరుగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష రద్దయ్యింది. ఈ నేపథ్యంలో ఈ 24 జిల్లాల్లో ఇంగ్లీష్ పరీక్షను తిరిగి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని యూపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది.