George Kurien | న్యూఢిల్లీ: బడ్జెట్లో కేరళను విస్మరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణపై కేంద్ర మంత్రి జార్జి కురియన్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు కావాలంటే కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే వెనుకబడిన రాష్ర్టాలకు కేంద్రం చేయూతనిస్తుందని కేరళకు చెందిన కేంద్ర మంత్రి మీడియాకు తెలిపారు.
విద్య, సామాజిక ప్రగతి, మౌలిక సౌకర్యాలలో కేరళ వెనుకబడి ఉందని, కేరళను వెనుకబడిన రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే దీన్ని ఫైనాన్స్ కమిషన్ పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని ఆయన తెలిపారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తమకు రోడ్లు లేవని, విద్య లేదని, సామాజిక అభివృద్ధి లేదని, మౌలిక సౌకర్యాలు లేవని కేరళ ప్రభుత్వం ప్రకటిస్తే కమిషన్ అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిస్తుందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక పాడి, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ చెప్పారు.
న్యూఢిల్లీ: గిరిజనులు నిజమైన ప్రగతి సాధించాలంటే గిరిజన వ్యవహారాల మంత్రి పదవిని బ్రాహ్మణులు, నాయుళ్లు వంటి అగ్ర వర్ణాలవారు నిర్వహించాలని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. గిరిజన సంక్షేమ మంత్రి పదవిని తనకు ఇవ్వాలని ప్రధాని మోదీని తాను కోరానని సురేశ్ గోపీ తెలిపారు. అయితే, మంత్రి పదవులను కేటాయించడంలో కొన్ని దృష్టాంతాలు ఉన్నాయన్నారు.
సురేశ్ గోపి వ్యాఖ్యలపై కేరళ సీపీఐ కార్యదర్శి బినోయ్ విశ్వమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వ్యవస్థను ఆయన సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విమర్శలు వెల్లువెత్తడంతో సురేశ్ వెనుకకు తగ్గారు. తాను సదుద్దేశంతోనే మాట్లాడానని, ఫలనావారు మంచివారని కానీ, చెడ్డవారని కానీ తాను చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు.