ముంబై: విదేశీ విద్యార్థులకు సంబంధించిన డిగ్రీలను ఆమోదించే విధానాన్ని క్రమబద్ధీకరిస్తూ యూజీసీ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. విదేశాలలో పొందిన డిగ్రీలు, స్కూల్ సర్టిఫికెట్లను తనిఖీ చేసి గుర్తింపు ఇచ్చేందుకు ఆన్లైన్ పోర్టల్‌ను యూజీపీ ప్రవేశపెట్టనున్నది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చే దృక్పథంతో జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)లో భాగంగా విదేశీ డిగ్రీల గుర్తింపు ప్రక్రియను సులభతరం చేయడమే ఈ కొత్త నిబంధన ఉద్దేశమని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
అంతర్జాతీయ డిగ్రీలు లేదా స్కూలు విద్యార్హతలతో చాలా మంది విద్యార్థులు భారత్‌కు తిరిగివస్తారని, అయితే వాటికి గుర్తింపు పొందడంలో తీవ్ర జాప్యాలు, అవరోధాలు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. ఈ కొత్త నిబంధన స్పష్టతను, కచ్చితమైన అంచనాను, నిష్పాక్షికతను అందచేయగలదని ఆయన వివరించారు. విదేశీ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ ఆన్లైన్ పోర్టల్‌ను యూజీసీ ప్రారంభించనున్నది. విద్యా సంబంధ నిపుణులతో కూడిన స్టాండింగ్ కమిటీ ఈ దరఖాస్తులను సమీక్షించి 15 పని దినాలలో తన నిర్ణయాన్ని తెలియచేస్తుంది. గుర్తింపు ఇచ్చేందుకు ప్రోగ్రామ్ కాల నిడివి, క్రెడిట్ హవర్స్, వాల్యుయేషన్ ప్రాసెస్, అకడమిక్ రికార్డులను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.