న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వివిధ కళాశాలల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే సీయూఈటీ-యూజీ పరీక్షలో సమూల మార్పులు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు. మంగళవారం ఆయన దీని వివరాలు ‘పీటీఐ’కి వెల్లడించారు. గత ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ) నిర్వహించగా, 2025 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇక మీదట 12వ తరగతిలో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా సీయూఈటీ-యూజీ పరీక్షకు ఏ సబ్జెక్టునైనా ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 63 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తుండగా, ఇక మీదట 37 సబ్జెక్టులకు తగ్గించనున్నట్టు చెప్పారు. మిగతా సబ్జెక్టుల్లో జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీఏటీ) మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు.
గతంలో పరీక్ష సమయం 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు ఉండగా, ఇక నుంచి అన్ని సబ్జెక్టులకు 60 నిమిషాలుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఐచ్ఛిక ప్రశ్నలు ఉండవని, అన్ని ప్రశ్నలకు తప్పనిసరి జవాబు రాయాల్సిందేననితెలిపారు. యూజీ సీ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ మార్పులు చేసినట్టు చెప్పారు.