న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టింది. ఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని సైన్యం తెలిపింది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లను విజయవంతంగా అడ్డుకోగలిగినట్టు శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ఐదు రాష్ర్టాల్లో 22 చోట్ల సోదాలు నిర్వహించింది. జైషే మొహమ్మద్ గ్రూప్‌నకు చెందిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీ రాష్ర్టాల్లో పలు చోట్ల ఈ సోదాలు చేపట్టింది.
న్యూఢిల్లీ: నాలుగో తరానికి చెందిన ‘అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ’ (వీఎస్హెచ్వోఆర్ఏడీఎస్)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో శనివారం ఈ పరీక్ష నిర్వహించారు. ఒకే రోజు మూడు క్షిపణుల పనితీరును పరిశీలించారు. ఇవి విజయవంతంగా లక్ష్యాలను ఛేదించినట్టు డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. మనుషులు సునాయాసంగా మోసుకెళ్లగలిగే ఈ గగనతల రక్షణ వ్యవస్థను డీఆర్డీవోలోని ల్యాబొరేటరీలు, భారత పారిశ్రామిక భాగస్వాములతో కలిసి హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ దేశీయంగా రూపొందించింది.