Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు చోటు చేసుకుంది. ఎర్రకోట గేట్-1కు సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని.. పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 6:52 గంటలకు నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు సంభవించిందని.. కారు సిగ్నల్ వద్దకు రాగానే పేలుడు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమయంలో కారులో ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లుగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు.
ఆ తర్వాత నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. పేలుడు తర్వాత పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. మూడు నుంచి నాలుగు వాహనాలకు మంటలు వ్యాపించగా.. ఆ తర్వాత ఏడు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేదని.. దర్యాప్తు జరుగుతుందన్నారు. మరో వైపు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి షా పరిస్థితిని సమీక్షించారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ విభాగంతో సహా భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. హోంమంత్రి ఇంటెలిజెన్స్ బ్యూరోతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. చాందినీ చౌక్ సర్వ్ వ్యాపార్ మండల్ అధ్యక్షుడు సంజయ్ భార్గవ మాట్లాడుతూ.. పేలుడు తర్వాత అనని దుకాణాలు మూసివేసినట్లు చెప్పారు. రోడ్లన్నీ కిక్కిరిసిసోయాయని.. కొనుగోలుదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. మార్కెట్ పార్కింగ్ ప్రాంతం వెలుపల చాలా పెద్ద క్యూ ఉందని.. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ కార్ల వద్దకు వెళ్లి వీలైనంత త్వరగా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.