Triple Talaq : ఇస్లాం మతంలోని త్రిపుల్ తలాక్ ఆచారం ముస్లిం మహిళల పరిస్థితిని దయనీయంగా మార్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. త్రిపుల్ తలాక్ ఆచారం వివాహమనే సామాజిక సంప్రదాయానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరించింది.
సుప్రీంకోర్టు 2017లో ఈ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొందని, అయినా కొంతమంది ముస్లింలలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోందని అఫిడవిట్ ద్వారా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అందువల్ల ముస్లింలలో త్రిపుల్ తలాక్ విడాకుల సంఖ్యను తగ్గించడంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రతిబంధకంగా పనిచేయలేదని తెలిపింది.
త్రిపుల్ తలాక్ బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకపోవడం, చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేకపోవడంతో బాధితుల భర్తలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని, దాంతో పోలీసులు నిస్సహాయంగా మారారని పేర్కొంది. త్రిపుల్ తలాక్ విడాకులను నిరోధించేందుకు కఠినమైన నిబంధనల అవసరం ఉందని వాదించింది.
కాగా త్రిపుల్ తలాక్ విధానం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయలేదని, కాబట్టి త్రిపుల్ తలాక్ విడాకులను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.