కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సొంత పార్టీ నేతపై చర్యలు చేపట్టింది. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై (Kolkata Hospital) గతంలో వచ్చిన ఫిర్యాదులను టీఎంసీ నేత శాంతాను సేన్ ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయనను తొలగించారు. శాంతాను సేన్ శుక్రవారం దీని గురించి మీడియాతో మాట్లాడారు. పార్టీకి లేదా ఏ నాయకుడికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తనను తొలగించినట్లు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ఫిరాయింపుదారులకు గౌరవం ఇస్తున్నారని, పార్టీకి అంకితమైన, నిజమైన సైనికులు ఇలాంటివి ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను టీఎంసీతోనే ఉంటానని, ఆ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు.
కాగా, మొదటి రోజు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని శాంతాను సేన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తొలగించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై గత మూడేళ్లుగా ఫిర్యాదులున్నాయని తెలిపారు. అయితే ఆరోగ్య శాఖకు సంబంధించిన వార్తలను సీఎం, ఆరోగ్య మంత్రి మమతా బెనర్జీకి ఖచ్చితంగా పంపడం లేదని ఆయన ఆరోపించారు.