Diabetes | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రోజూ ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను వాడటం రోగులకు ఇబ్బందే. దీనికి చెక్ పెడుతూ క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను ఉత్తేజితం చేసే వినూత్న డ్రగ్ థెరపీని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకల్లో చేసిన ఈ ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చాయని, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను ఈ డ్రగ్ థెరపీతో 700 శాతం మేర ఉత్తేజితం చేశామని పరిశోధకులు పేర్కొన్నారు.
రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడం కోసం క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, వీటి పనితీరులో ఇబ్బంది కలిగినా, లేక ఈ కణాలు నాశనమైనా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్లకు గురవుతాం. దీన్ని నివారించడానికి ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, దీనికి ముగింపు పలుకుతూ.. నిర్జీవంగా మారిన లేదా పనిచేయకుండాపోయిన బీటా కణాలను పునరుత్తేజితం చేసే డ్రగ్ థెరపీని మౌంట్ సినాయీ, సిటీ ఆఫ్ హోప్ సంస్థల వైద్య నిపుణులు అభివృద్ధి చేశారు.
‘ఫంక్షనల్ డయాబెటిస్ క్యూర్’గా పిలిచే ఈ థెరపీ సాయంతో పనిచేయకుండా పోయిన బీటా కణాలను కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఉత్తేజితం చేయగలమని చెప్పారు. నిర్జీవంగా మారిన బీటా కణాల స్థానంలో కొత్త కణాలను కూడా ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. దీనికోసం మూలకణాల సాయాన్ని తీసుకొంటామని వివరించారు. ఈ డ్రగ్ థెరపీలో సహజసిద్ధంగా దొరికే హార్మైన్, పీఎల్పీ1 వంటి ఔషధాలను వినియోగించినట్టు తెలిపారు. మనుషులపై ఈ ప్రయోగం విజయవంతమైతే, డయాబెటిస్‌కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.