రాంచి: కీలక నక్సల్ నేత, సీపీఐ మావోయిస్టు ఆర్గనైజేషన్ రీజనల్ కమాండర్ అమన్ గంఝు ఇవాళ జార్ఖండ్ పోలీస్, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల ముందు లొంగిపోయారు. అమన్ గంఝు తలపై మొత్తం రూ.19 లక్షల రివార్డు ఉన్నది. అమన్ గంఝు పట్టించేవారి కోసం జార్ఖండ్ ప్రభుత్వం రూ.15 లక్షల రివార్డు ప్రకటించగా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మరో రూ.4 లక్షల రివార్డు ప్రకటించింది.
ఆపరేషన్ ఐజీ ఏవీ హోమ్కర్, రాంచి జోనల్ ఐజీ పంకజ్ కంబోజ్, గర్హ్వా ఎస్పీ అంజనీ ఝా సమక్షంలో అమన్ గంఝు లొంగుబాటు జరిగింది. జార్ఖండ్‌లోని లతేహర్, లొహర్డగ, గుమ్లా ఏరియాల్లో గంఝు కీలక పాత్ర పోషించారు. ఆయన 2004లో మావోయిస్టు ఆర్గనైజేషన్‌లో చేరారు. అతనిపై మొత్తం 17 కేసులు ఉన్నాయి. అందులో 10 కేసులు గర్హ్వా జిల్లాలో, 7 కేసులు లతేహర్ జిల్లాలో నమోదయ్యాయి.