కోల్‌కతా: సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు మగవాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారని, ఒక స్నేహితుడు తన స్నేహితురాలిపై రేప్‌కు తెగబడితే ఏం చేయగలమని ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేయాల్సిందేనన్నారు. ఈ ఘటనలో విద్యార్థుల పాత్ర ఉందని నొక్కి చెప్పారు. అది ప్రభుత్వ కాలేజీ అని, అక్కడ నిత్యం పోలీసులు ఉండరని పేర్కొన్నారు. కాబట్టి బాధితురాలిని ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. కాగా, లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన కేసులో నిందితులకు కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు నిందితులకు సహకరించిన కాలేజీ సెక్యూరిటీ గార్డ్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
‘ఆమె అక్కడికి వెళ్లకపోతే రేప్ జరిగేది కాదు’
టీఎంసీకే చెందిన ఎమ్మెల్యే మదన్ మిత్రా కూడా బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె అక్కడికి వెళ్లి ఉండకపోతే, ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. తాను ఎక్కడికి వెళ్తున్నదీ ఆమె ఎవరికైనా చెప్పినా, ఇద్దరు మిత్రులను తనతో తీసుకెళ్లినా రేప్ జరిగి ఉండేది కాదు. నేరానికి పాల్పడినవారు ఈ పరిస్థితినే తమకు అనుకూలంగా మార్చుకున్నారు’ అంటూ అగ్నికి ఆజ్యం పోశారు.