ముంబై: టీవీ సీరియల్ నటి తునిషా శర్మ మృతి కేసులో ఆమె సహనటుడు షీజాన్ మహమ్మద్ ఖాన్‌పై వస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని షీజాన్ తరఫు న్యాయవాది శరద్ రాయ్ చెప్పారు. తునీషాను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై షీజాన్‌ను ఇవాళ తెల్లవారుజామున వాలివ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.
అరెస్ట్ అనంతరం షీజాన్‌ను ముంబైలోని వాసాయ్ కోర్టులో హాజరుపర్చారని, కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించిందని లాయర్ శరద్ రాయ్ వెల్లడించారు. కేసులో ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు జరుగుతున్నదని, ఇన్వెస్టిగేషన్లో నిజానిజాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు.
తునిషా శర్మ శనివారం మధ్యాహ్నం టీవీ సీరియల్ సెట్లో ఆత్మహత్యకు పాల్పడింది. టాయిలెట్స్‌కు వెళ్లి ఉరేసుకుని చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రేమలో ఉన్న తునిషాకు, షీజాన్కు మధ్య 15 రోజుల క్రితం బ్రేకప్ అయ్యిందని తెలుసుకున్న పోలీసులు.. షీజానే ఆమెను ఆత్మహత్యకు పురికొల్పి ఉంటాడనే అనుమానంతో సెక్షన్ 306 కింద అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.