Online Orders | న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటిలో ఆన్లైన్లో ఆర్డర్లు చేసే వారు పారాహుషార్! వాటిలో వచ్చే డెలివరీ బాక్స్‌ల వల్ల మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ముప్పు పొంచి ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పెట్టెల్లోని వస్తువులను తీసుకుని, పెట్టెలను చెత్త కుప్పలోకి విసిరేయడం చాలా మందికి అలవాటే. వీటిపైన కస్టమర్ పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, ఏ వస్తువును ఆర్డర్ చేశారు? వంటి వివరాలు ఉంటాయి.
అయితే ఇవన్నీ స్కామర్లకు అందివచ్చిన అవకాశంగా మారాయి! ఈ పెట్టెలను కేటుగాళ్లు తీసుకుని, కస్టమర్‌కు ఫోన్ చేసి వారు తీసుకున్న వస్తువు గురించి సమాచారం అడుగుతున్నారు. ‘ఈ ఫీడ్‌బ్యాక్ కోసం స్కామర్లు ఓ లింక్‌ను పంపిస్తారు. ఆ లింక్‌లోని మాల్వేర్ కస్టమర్ డివైస్‌లోకి ప్రవేశించి, బ్యాంకు ఖాతాల వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తుంది. అనంతరం స్కామర్లు ఆ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తారు.
డెలివరీ బాక్సులను చెత్తలో పడేసే ముందు కస్టమర్ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని పూర్తిగా చెరిపేయాలని నిపుణులు అంటున్నారు.