S Jaishankar : అమెరికా (USA), యూరప్ (Europe) దేశాల్లో వలసలపై ఆంక్షలతో విదేశాంగశాఖ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే.. ఆ ఆంక్షలు విధించిన దేశాల సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. చివరకు ఆ దేశాలే నష్టపోతాయని హెచ్చరించారు.
ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మాట్లాడారు. చాలా సందర్భాల్లో అమెరికా, యూరప్ దేశాల వాళ్లే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వలసలకు సంబంధించి అమెరికా, యూరప్ దేశాల్లో ఏమైనా ఆందోళనలు ఉంటే.. అవి ఆ దేశాలు అమలు చేసిన దీర్ఘకాలిక విధానాల ఫలితమేనన్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఉద్దేశపూర్వకంగా అన్నీ తెలిసే తమ వ్యాపారాలను విదేశాలకు విస్తరించారని, ఇది వారి వ్యూహమని, కాబట్టి ఈ సమస్యలకు స్వయంగా పరిష్కార మార్గాలను వారే కనుగొనాలని వ్యాఖ్యానించారు.
నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలనేవి ఇరుపక్షాలకు ప్రయోజనమని పాశ్చాత్య దేశాలు గుర్తించాలన్నారు. ఒకవేళ పెద్దఎత్తున ఆంక్షలు విధిస్తే ఆ దేశాలే నష్టపోతాయని, ప్రపంచం అధునాతన తయారీ రంగంవైపు మళ్లుతున్న కొద్దీ నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరం పెరుగుతుందని చెప్పారు. ఏ దేశం కూడా స్వయంగా సరిపడా సంఖ్యలో నిపుణులను వేగంగా తయారు చేయలేదని అన్నారు. ఒత్తిళ్లను సమతుల్యం చేసుకునేందుకు పాశ్చాత్య దేశాలు చివరకు ఓ మార్గాన్ని కనుగొంటాయని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.