ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది తెలియని పరిస్థితి నెలకొన్నది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌ను, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) సోమవారం కలిశారు. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీలో చేరవచ్చంటూ ఎన్సీపీలో వినిపిస్తున్న గుసగుసలపై ఆరా తీశారు. తన పార్టీ బీజేపీతో చేతులు కలపదని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఒత్తిడితో బీజేపీలో చేరవచ్చని సంజయ్ రౌత్‌తో ఆయన అన్నారు.
కాగా, శరద్ పవార్‌తో భేటీ అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ, పోలీస్ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి శివసేనను ఎలా చీల్చిందో ఇప్పుడు ఎన్సీపీని కూడా అలా చేసే ప్రయత్నంలో బీజేపీ ఉందని విమర్శించారు. అందుకే ఎన్సీపీ నేతలపై ఒత్తిడి, బెదిరింపులు పెరుగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ బీజేపీతో ఎన్సీపీ చేతులు కలబోదని అన్నారు. అయితే ఒత్తిడి వల్ల కొందరు ఎన్సీపీ నేతలు ఆ పార్టీని వీడవచ్చని చెప్పారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమంటూ పరోక్షంగా అజిత్ పవార్‌ను ఉద్దేశించి అన్నారు.
మరోవైపు శరద్ పవార్ తర్వాత ఎన్సీపీలో కీలకమైన ఆయన మేనల్లుడు అజిత్ పవార్, బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని శరద్ పవార్‌కు కూడా ఆయన తెలియజేసినట్లు సమాచారం. అలాగే ముంబైకి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అజిత్ పవార్ శనివారం రాత్రి కలిసినట్లు పలు వార్తా కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ నిరాధార ఊహాగానాలంటూ అజిత్ పవర్ తోసిపుచ్చారు.
కాగా, ఇటీవల ఎన్సీపీ కార్యక్రమానికి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. మొబైల్ ఫోన్‌ను స్వీచ్ ఆఫ్‌లో ఉంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీనిపై కూడా పలు ఊహాగానాలు రాగా, ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకున్నానంటూ ఆయన వివరణ ఇచ్చారు.