న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఇప్పటికే పలు కారణాలతో 2021 నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనగణన నిర్వహణ మరోమారు వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నది. అడ్మినిస్ట్రేటివ్ సరిహద్దుల ఫ్రీజింగ్‌ను 2024, జూన్ 30 వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ఈ మేరకు అడిషనల్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) తాజాగా రాష్ర్టాలకు సమాచారమిచ్చినట్టు జాతీయ మీడియా సంస్థ ది హిందూ పేర్కొన్నది. దీని ప్రకారం 2024 ఏప్రిల్ లేదా మే నెలలో లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగా జనగణన జరిగే అవకాశం లేకపోగా.. అక్టోబర్ వరకు ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యే చాన్స్ లేదు. జిల్లాలు, తహశీల్లు, పట్టణాల అడ్మినిస్ట్రేటివ్ సరిహద్దులను ఫ్రీజ్ చేస్తూ డైడ్‌లైన్‌ను పదేపదే పొడిగించడం వలన ఇప్పటికే ఆలస్యం అయిన జనగణనపై ప్రభావం పడుతున్నది. సరిహద్దులను సెట్ చేసిన తర్వాత ఎన్యుమరేటర్లను గుర్తించేందుకు, వారికి శిక్షణ ఇచ్చేందుకు మూడు నెలల సమయం పడుతుంది. కాగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన అమల్లోకి వస్తుంది. అయితే ఈ పునర్విభజన అనేది జనగణనపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనగణన నిర్వహణలో జరుగుతున్న జాప్యం మహిళా రిజర్వేషన్ల అమలుపై కూడా ప్రభావం చూపుతుంది.