న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 23నే ముగించే అవకాశాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగాల్సి ఉంది. అయితే సభా సమయాన్ని తగ్గించాలని డీఎంకే, టీఎంసీ, బీజేడీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కోరినట్టు తెలిసింది. 25న క్రిస్మస్ ఉన్నందున ఆ రోజున నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, దీన్ని దృష్టిలో పెట్టుకొని 23నే సమావేశాలను ముగించాలని కోరినట్టు తెలిసింది. అయితే, ఆ నిర్ణయం తన చేతుల్లో లేదని, కేంద్రం సరేనంటే ఇబ్బందేమీ లేదని ఓం బిర్లా చెప్పినట్టు సమాచారం. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకొన్నందున ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ ఎంపీలకు చెప్పినట్టు తెలిసింది. కాగా, ప్రస్తుత సమావేశాల్లో కేంద్రం 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని చూసింది. అందులో ఇప్పటి వరకు ఐదింటినే ప్రవేశపెట్టింది.