Sanjay Raut : మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) వర్గం శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (UBT) వందకుపైగా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోందా..?’ అని మీడియా ప్రశ్నించగా.. రౌత్ ఆసక్తికరంగా క్రికెట్ పరిభాషలో సమాధానం ఇచ్చారు. ‘దేశం ఎప్పుడూ శివసేన సెంచరీ కొట్టాలనే కోరుకుంటుంది’ అని చెప్పారు. తమకు అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొట్టే సత్తా ఉన్నదని, కొట్టి తీరుతామని అన్నారు.
ముంబైలో క్రికెట్ ఆడటం, చూడటం బాగానే జరిగిందని, క్రికెట్లో సంచరీకి చాలా ప్రాముఖ్యం ఉంటుందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శివసేన (UBT), ఎన్సీపీ (SCP), కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీ (MVA) లో సీట్ల పంపకంపై పీఠముడి వీడటం లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహా వికాస్ అఘాడీలో సీట్ల పంపకంపై ఇంకా మంతనాలు జరుగుతున్నాయి. శివసేన అధిక సీట్లు డిమాండ్ చేస్తుండగా అందుకు కూటమి నేతలు ఒప్పుకోవడం లేదని తెలిసింది.
మరోవైపు మంగళవారం శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఉద్ధవ్ శివసేన కూడా అధికార మహాయుతి కూటమితో కలువబోతున్నదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం సీట్ల విషయంలో తన పంతం నెగ్గించుకోవడం కోసమే ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన నేతలు ఈ విధమైన లీకులు ఇస్తున్నారని చెబుతున్నారు.