న్యూఢిల్లీ: కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ (సీబీఐసీ) 31 కస్టమ్స్ డ్యూటీ నోటిఫికేషన్లను ఏకైక ఏకీకృత నోటిఫికేషన్‌గా విలీనం చేసింది. ఇది వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. సరళీకరణ, పారదర్శకత, వ్యాపారం చేయడం సులభతరంగా మార్చడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రస్తుత సుంకాల మినహాయింపులు, ప్రయోజనాలన్నీ ఈ కొత్త నోటిఫికేషన్లో ఉన్నాయి. అదే సమయంలో ఇవన్నీ మరింత నిర్మాణాత్మకంగా, సరళంగా ఉన్నాయి. కస్టమ్స్ విధానాలను హేతుబద్ధం చేయడంలో, వీటిని పాటించడంలో వ్యాపారులు, కస్టమ్స్ అధికారులపై భారాన్ని తగ్గించడంలో ఈ చర్య మైలురాయి వంటిది.