Data Leak | కరోనా టీకా వేసుకోవాలంటే.. పేరు, ఊరు, ఫోన్ నంబర్, ఆధార్.. ఇలా సమస్త సమాచారం ఇవ్వాలని కేంద్రం అప్పట్లో నిబంధన పెట్టింది. ‘కొవిన్’ పోర్టల్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తేనే స్లాట్ బుకింగ్‌కు అవకాశమిచ్చింది. టీకా కోసం తప్పని పరిస్థితుల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 111 కోట్ల మంది తమ సమాచారం అందించారు. ఇప్పుడు ఆ డాటా అంగట్లో సరుకుగా మారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కేంద్రం అలసత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో అతి పెద్ద డాటా లీక్ వెలుగు చూసింది. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకొచ్చిన ‘కొవిన్’ పోర్టల్‌లోని పౌరుల వ్యక్తిగత సమాచారం బయటకొచ్చింది. రాజకీయ నేతలు, ప్రముఖులతో పాటు సామాన్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ తదితర వివరాలు ప్రముఖ మెసెంజర్ యాప్ టెలిగ్రామ్‌లో సోమవారం ఉదయం కనిపించినట్టు పలు మీడియా సంస్థల్లో వార్తలు రావడం కలకలం రేపింది. టెలిగ్రామ్‌లోని ఓ బాట్లో ఫోన్ నంబర్ లేదా పేరు నమోదు చేయగానే కొవిన్ పోర్టల్‌లో రిజిస్టరైన వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారం వచ్చినట్టు ఆ వార్తలు వెల్లడించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, కాంగ్రెస్ నేతలు చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తదితరుల వివరాలు కూడా బయటకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులను బట్టి తెలుస్తున్నది. కొవిన్ డ్యాష్ బోర్డ్ ప్రకారం.. ఇప్పటి వరకు పోర్టల్‌లో 1,10,92,27,606 మంది రిజిస్టరయ్యారు. వీరందరి డాటా కూడా అంగట్లో సరుకుగా మారినట్టేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాటా లీకేజీ తీవ్రమైన అంశమని తృణమూల్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కొవిన్ పోర్టల్ డాటా లీకేజీని దేశంలోనే అతిపెద్ద డాటా లీక్‌గా పలువురు అభివర్ణిస్తున్నారు.
‘కొవిన్’ పోర్టల్ నుంచి పౌరుల సమాచారం లీక్ అయ్యిందన్న వార్తలను కేంద్రం కొట్టి పారేసింది. పౌరులకు సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత వివరాలు లీక్ కాలేదని చెప్పుకొచ్చింది. డాటా లీక్ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు (సెర్ట్) ఆదేశించినట్టు వెల్లడించింది. అయితే, డాటా లీకేజీ జరుగకుంటే, కొవిన్ పోర్టల్‌లోని వ్యక్తులకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో ఎలా కనిపించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
‘కొవిన్’ పోర్టల్ నుంచి 15 కోట్ల మంది డాటా లీక్ అయ్యిందంటూ గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, డాటా లీకేజీని ఖండిస్తూ.. జూన్ 12, 2021 రోజున నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ ఓ ప్రకటన చేశారు.
మొత్తం రిజిస్ట్రేషన్లు – 1,10,92,27,606
12-14 మధ్య వయసు వారు – 4,21,07,193
15-17 మధ్య వయసు వారు – 6,29,28,554
18-44 మధ్య వయసు వారు – 63,36,97,833
45 ఏండ్లు ఆపైబడినవారు – 37,04,36,476