చెన్నై: తమిళనాడులోని తిరువణ్ణామలైలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు గుర్తించారు. ఆలయంలోని నాల్గో ప్రహారం (బయటి ప్రాంగణం) ప్రాంతంలో ఓ వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు గమనించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆలయాధికారులు అతడి దగ్గరికి వచ్చి ఏం తింటున్నాడని ప్రశ్నించగా.. సదరు వ్యక్తి తాను ‘కుస్కా’ (సాదా బిర్యానీ) ఆర్డర్ చేశానని, అయితే అందులో చికెన్ ముక్కను కూడా ప్యాక్ చేశారని తెలిపాడు.
అతడు తినే ఆహారాన్ని ప్యాక్ చేయించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకున్నది. మధురైలోని పవిత్రమైన తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి కొండ దగ్గర ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత, రామనాథపురం ఎంపీ నవాస్ ఖని మాంసాహారం తిన్నారని బీజేపీ నేత అన్నామలై ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అన్నామలై ఆరోపణలను ఎంపీ ఖండించారు. కాగా, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేందుకు తరుచూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.