లక్నో: రెండు వర్గాల మధ్య భూవివాదం ఒక బాలుడి ప్రాణాలను బలిగొన్నది. ప్రత్యర్థులు ఒక వర్గంపై కత్తితో దాడి చేశారు. 17 ఏళ్ల యువకుడి తల నరికారు. దీంతో తెగిన కుమారుడి తలను తల్లి తన ఒడిలోపెట్టుకుని ఏడ్చింది. (Teen’s Head Chopped Off) ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కబీరుద్దీన్ గ్రామంలోని భూ విషయంపై రెండు వర్గాల మధ్య 40 ఏళ్లకుపైగా వివాదం కోర్టులో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ రెండు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు.
కాగా, ఇది హింసాత్మకంగా మారింది. రామ్‌జీత్ యాదవ్ కుమారుడైన 17 ఏళ్ల అనురాగ్‌ను కొంతమంది వ్యక్తులు వెంబడించారు. ఒక వ్యక్తి అనురాగ్ మెడపై కత్తితో దాడి చేయడంతో మొండెం నుంచి తల వేరైంది. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు.
మరోవైపు తెగిన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని బాలుడి తల్లి బోరున ఏడ్చింది. ఈ ఘర్షణ గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు జరుగకుండా ఆ గ్రామంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. బాలుడి హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కత్తితో నరికిన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.