న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఇంజినీరింగ్ చదివితే జాబ్ గ్యారెంటీ.. భవిష్యత్తు భద్రంగా ఉంటుందనేది మన దేశంలో చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకం. అందుకే గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఏ కోర్సుకూ లేనంత డిమాండ్ ఇంజినీరింగ్‌కు పెరుగుతున్నది. డిమాండ్‌కు తగ్గట్టుగానే వేల సంఖ్యలో కళాశాలలు సైతం వెలిశాయి. దేశంలో పారిశ్రామీకరణతో ఇంజినీరింగ్ విద్యకు మొదలైన డిమాండ్ 1990లలో ఐటీ విప్లవంతో గణనీయంగా పెరిగింది. గత 10 – 15 ఏండ్లుగా దేశంలోని మెజారిటీ విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను ఏకైక మార్గంగా భావించడం ప్రారంభమైంది. అయితే, ఇటీవలి కాలంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకనాడు జాబ్ గ్యారెంటీ అనే భరోసా ఇచ్చిన బీటెక్ కోర్సులు ఇప్పుడు ఔట్డేటెడ్గా మారుతున్నాయి. ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారుతున్నది. ఇందుకు సంబంధించి ‘టీమ్ లీజ్ డిగ్రీ అప్రెంటీస్‌షిప్’ చేసిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఉద్యోగం దక్కేది 10 శాతం మందికే
దేశంలో ఈ ఏడాది 15 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేయబోతున్నారని, వీరిలో 10 – 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ‘టీమ్ లీజ్’ నివేదిక అంచనా వేసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసేవారిలో దాదాపుగా 60 శాతం మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారని, కానీ వీరిలో పరిశ్రమ అంచనాలకు తగ్గట్టుగా ఉండేది మాత్రం కేవలం 45 శాతం మందేనని టీమ్ లీజ్ సీఈఓ ఏఆర్ రమేశ్ తెలిపారు. ఐఐటీల్లో చదివిన వారికి కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతున్నది. 2024లో పట్టభద్రులైన ఐఐటీ విద్యార్థుల్లో 60 శాతం మంది మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందినట్టు టీమ్ లీజ్ వెల్లడించింది. ఎన్ఐటీలు, ఇతర ప్రఖ్యాత ఇంజినీరింగ్ యూనివర్సిటీలు, కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 60 శాతం మందికి కూడా ఉద్యోగాలు లభించలేదని పేర్కొన్నది.
డిమాండ్ ఉన్నా స్కిల్స్ లేవు
ఇంజినీరింగ్ పూర్తి చేసే వారికి డిమాండ్ ఉన్నప్పటికీ నైపుణ్యాలు లేకపోవడమే అసలు సమస్య. కృత్రిమ మేధ(ఏఐ), విద్యుత్ వాహనాలు, సెమికండక్టర్ల తయారీ వంటి కొత్త రంగాలకు ప్రాముఖ్యం పెరగడంతో ఈ అంశాల్లో నైపుణ్యాలు ఉన్న పట్టభద్రులకు డిమాండ్ పెరుగుతున్నది. మరోవైపు మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై నైపుణ్యాలు ఉన్న వారి అవసరం కూడా పరిశ్రమలకు పెరుగుతున్నది. ఏఐ, కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాల కొరత భారీగా ఉన్నది. ఈ సాంకేతికతల్లో 25-30% నైపుణ్యాల కొరత ఉన్నట్టు టీమ్ లీజ్ అధ్యయనం పేర్కొన్నది. దేశంలోని ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో 80% మందికి ఈ రంగంలో రాణించే నైపుణ్యాలు లేవని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతికతలపై ఇంజినీరింగ్ విద్యలో పాఠాలు లేకపోవడం, ప్రాజెక్టు ఆధారిత ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉద్యోగార్హత – నైపుణ్యాల కొరత
విభాగం శాతం