చెన్నై, జూలై 9: గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ఆయన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ముప్పుగా మారారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం లేఖ రాస్తూ ‘గవర్నర్ రవి మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అది రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి తీవ్ర భంగం కలిగిస్తున్నది’ అని పేర్కొన్నారు. ఇటీవల మంత్రివర్గం నుంచి వీ సెంథిల్ బాలాజీని తప్పించడం, తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వంటి గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా గత ఏఐఏడీఎంకే పాలనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రిపై విచారణకు అనుమతి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రవర్తన, చర్యలను బట్టి చూస్తే ఆయన ఆ పదవికి అర్హమైన వ్యక్తి కాదని రుజువైందన్నారు. అందుకే అతడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి భయపడం
బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ క్రమంలో తమిళనాడులో ఉన్న డీఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్డడానికి ప్రయత్నించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తమ పార్టీ విపక్ష బీజేపీని ఎదుర్కోవడానికి పటిష్ఠంగా ఉందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఆదివారం స్థానికంగా ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీకి తాము భయపడమని స్పష్టం చేశారు. ఈ నెల 17-18 మధ్య జరిగే విపక్షాల రెండో విడత సమావేశం బీజేపీకి ముఖ్యంగా ప్రధాని మోదీకి సహజంగానే ఆగ్రహం కలిగిస్తాయని అన్నారు.
అందుకే ఆయన తాను ప్రధానిని అన్న విషయం కూడా మరచిపోయి ఏవేవో విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశం గురించి స్టాలిన్ ప్రస్తావిస్తూ గెలిస్తే ప్రధాని ఎవరు అవుతారన్న అంశంపై కాకుండా ఎలాంటి పటిష్ఠ పరిపాలన అందించాలో అన్న అంశంపై విపక్షాలు దృష్టి సారించాలని సూచించారు. డీఎంకే, మిత్రపక్షాలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతోనే పోరాడుతున్నాయని అన్నారు.
వాగ్దానాల అమలేది?
ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నైనా నిలుపుకుందా? అని స్టాలిన్ ప్రశ్నించారు. బ్లాక్ మనీని వెనక్కి రప్పించి ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తామని మోదీ చేసిన వాగ్దానం అమలు చేశారా అని అడిగారు.15 లక్షలు కాదు కదా కనీసం 15 రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగాల కల్పన, రైతుల సంక్షేమంపై ఎన్నో వాగ్దానాలు చేసిన ఆయన ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని స్టాలిన్ విమర్శించారు.