షాజహాన్పూర్, ఆగస్టు 26: ‘ఒక వేళ లంచం వస్తే దానిని సమానంగా పంచుకుంటాం. ఈ విషయంలో ఒకరికొకరం అండగా ఉంటాం’ అంటూ మున్సిపల్ కౌన్సిలర్లు గంగాజలం సాక్షిగా ప్రమాణం చేసిన బరితెగింపు ఘటన బీజేపీ పాలిత యూపీలోని షాజహాన్పూర్లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కౌన్సిలర్ల నిస్సిగ్గు అవినీతిని ప్రజలు ఛీత్కరిస్తుండగా, అధికారులు విచారణకు ఆదేశించారు. పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమం తరహాలో ఈ లంచం ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఒక వ్యక్తి పాత్రలో గంగాజలంతో ఉండగా, మిగతా వారు చేతిలో నీటితో అతను చేసిన ప్రమాణాన్ని తూ.చా తప్పకుండా వల్లెవేయడం ఈ వీడియోలో కన్పించింది.
ఆ ప్రమాణంలోని సారాంశం ప్రకారం లంచం ద్వారా వచ్చిన సొమ్మును 60 మంది మధ్య సమానంగా పంచుకుంటాం.. ఒకరికొకరు అండగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఏ సభ్యునికైనా సమస్య వస్తే పరస్పరం మద్దతు ఇచ్చుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఒక వ్యక్తిని ద్రోహిగా పేర్కొంటూ చేసిన అభ్యంతరకరమైన ప్రస్తావన కూడా ఈ వీడియోలో ఉంది. ప్రజాధనాన్ని పంచుకోవడానికి కౌన్సిలర్లు బరితెగించి ఇలా ప్రమాణం చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని బట్టి వారు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థమవుతున్నదని విమర్శించారు. కాగా, ఇది గత ఏడాది నవంబర్ నాటి వీడియో అని, తాను అప్పుడు పదవిలో లేనని, అయినప్పటికీ దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్టు మున్సిపల్ కమిషర్ సౌమ్యా గురురాణి తెలిపారు. విచారణ అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.