న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద చెత్త పోశారు. ఢిల్లీ అంతా చెత్తమయంగా మారిందని, ఆప్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వంపై స్వాతి మలివాల్ మండిపడ్డారు. ‘ఈ నిరసన ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా నేడు దారుణమైన స్థితిలో ఢిల్లీ ఉంది. ఢిల్లీలోని ప్రతి మూల మురికిగా ఉంది. రోడ్లు నాశనమయ్యాయి. మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నగరం మొత్తం చెత్త కుండీగా మారింది. నేను అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చా. ఆయన గూండాలకు లేదా పోలీసులకు నేను భయపడను’ అని అన్నారు.
కాగా, రోడ్డుపై చెత్త కుప్ప పేరుకుపోయినట్లు వికాస్పురికి చెందిన మహిళలు తనకు ఫిర్యాదు చేశారని స్వాతి మలివాల్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినప్పటికీ, శుభ్రం చేసేందుకు ఎవరూ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్థానిక మహిళలు నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ‘ఈ చెత్తను అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్తాం. ఢిల్లీలోని ప్రతి ప్రాంతానికి ఆయన ఇచ్చిన ఈ మురికి బహుమతిని ఏమి చేయాలో అడుగుతాం. కేజ్రీవాల్ ఎంతమాత్రం ఆమ్ ఆద్మీ కాదు. ఆయనకు ఢిల్లీ వాస్తవాల గురించి తెలియదు’ అని మీడియాతో అన్నారు. దీనికి ముందు మూడు లారీల చెత్తతో కేజ్రీవాల్ నివాసానికి వెళ్తానని ఆమె ప్రకటించారు.
మరోవైపు ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన అనుచరురాలిగా ఉన్న స్వాతి మలివాల్ ఆప్ మద్దతుతో రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మారారు. గత ఏడాది మేలో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆయన అనుచురుడు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేతలకు వ్యతిరేకంగా స్వాతి మలివాల్ గళమెత్తుతున్నారు.
#WATCH | Delhi: Rajya Sabha MP Swati Maliwal says, “The whole city has turned into a garbage bin…I came here to have a conversation with Arvind Kejriwal… I would say to him ‘sudhar jao warna janata sudhaar degi’… I am neither afraid of his goons nor his police…” https://t.co/iFldkCj75G pic.twitter.com/jgf0ZupcGZ
— ANI (@ANI) January 30, 2025