లక్నో : సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) హిందుత్వపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన బహుజన్ సమాజ్ హక్కుల సదస్సును ఉద్దేశించి మౌర్య మాట్లాడుతూ హిందూ మతం మోసపూరితమని వ్యాఖ్యానించారు. హిందూ మతం మోసం వంటిదని అంటూ హిందూ మతం అనేది లేదని, అది ఓ జీవన విధానమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం హిందూ మతం అనేది లేదని చెప్పారని మౌర్య పేర్కొన్నారు. వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవని, స్వామి ప్రసాద్ మౌర్య అలాంటి ప్రకటనలు చేస్తే మాత్రం అది అలజడి రేపుతుందని మౌర్య అన్నారు. కాగా మౌర్య వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. మతం, కులంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని మౌర్యకు అఖిలేష్ సూచించారు.
ప్రభుదా సమాజ్, మహా బ్రాహ్మిన్ సమాజ్ పంచాయత్ సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి అఖిలేష్ మాట్లాడుతూ మతం, కులం వంటి అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని మౌర్యకు హితవు పలికారు. అంతకుముందు మౌర్య ప్రకటనల పట్ల పలువురు ఎస్పీ బ్రాహ్మణ నేతలు అఖిలేష్‌కు ఫిర్యాదు చేయడంతో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక మౌర్య గతంలోనూ పలు సందర్భాల్లో హిందూ మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Read More :