కోల్కతా: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని దక్షిణ బెంగాల్ ప్రాంతంలో అనుమానాస్పద హ్యామ్ రేడియో సిగ్నళ్లు రెండు నెలల నుంచి వస్తున్నట్లు అమెచ్యూర్ హ్యామ్ రేడియో ఆపరేటర్లు గుర్తించారు. బెంగాలీ, ఉర్దూ, అరబిక్ భాషల్లో రహస్య సంకేత భాషలో ఈ సిగ్నల్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవి స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవి అయి ఉండవచ్చునని అధికారులు చెప్పారు.
ఈ సిగ్నల్స్ రాత్రి 1-3 గంటల మధ్య వచ్చాయని వారు తెలిపారు. నిరుడు డిసెంబర్లో మొదటిసారిగా ఈ సిగ్నల్స్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఈ ఆపరేటర్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖకు తెలిపారు. బంగ్లాదేశ్లో హింసాత్మక కార్యకలాపాలు, భారత వ్యతిరేకత కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం.