న్యూఢిల్లీ: ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ అతని భార్య చారు అసోపా గురించి సంచలన ఆరోపణలు చేశాడు. తన భర్తకు పర స్త్రీలతో సంబంధాలున్నాయని టీవీ నటి చారు అసోపా ఇటీవల ఆరోపించగా.. రాజీవ్‌సేన్ కూడా చారుపై అలాంటి ఆరోపణలతోనే విరుచుకుపడ్డాడు. చారు అసోపాకు ప్రముఖ టీవీ నటుడు కరన్ మెహ్రాతో వివాహేతర సంబంధం ఉన్నదని ఆరోపించాడు.
ఒక వ్యక్తిగా ఆమెను తాను ఎంతో గౌరవంగా చూశానని, కానీ ఆమె మాత్రం ప్రతిసారి తనపై మహిళా కార్డును ప్రయోగించిందని రాజీవ్‌సేన్ చెప్పాడు. ఆమెకు కచ్చితంగా మతి భ్రమించిందని, ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈగోతో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డాడు. ప్రూఫ్ లేకపోయినా ఆమె ఈగో రూఫ్ దాటిపోయిందని వ్యాఖ్యానించాడు.
తనపై అంత తీవ్రమైన ఆరోపణలు చేసినా తన కుటుంబసభ్యులు మాత్రం తనకంటే ఎక్కువగా ఆమెనే ప్రేమగా చూసేవారని రాజీవ్‌సేన్ చెప్పాడు. తనను ఇంత అవమానించి, మానసికంగా హింసించిన చారు అసోపాను జీవితంలో క్షమించనని ఆయన వ్యాఖ్యానించాడు. చారు తల్లి నీలమ్ అసోపా తనకు పంపిన వాయిస్ నోట్సే.. చారుకు, కరన్‌కు మధ్య వివాహేతర బంధం ఉందనడానికి సాక్ష్యమని పేర్కొన్నాడు.