ముంబై, డిసెంబర్ 26: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేండ్లకు పైగా గడిచింది. ఆయన మృతి అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అతడి మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. సుశాంత్‌ది హత్యా? లేక ఆత్మహత్యా? అనేదానిపై పెద్దచర్చనే నడిచింది. అయితే సుశాంత్ మరణం గురించి ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వారిలో ఒకరు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ 2020 జూన్‌లో పోస్టుమార్టం నిర్వహించిన ముంబైలోని కూపర్ దవాఖాన సిబ్బందిలో ఒకరైన రూప్‌కుమార్ షా పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సుశాంత్ శరీరంపై గాయాలు ఉన్నాయని, అది హత్యేనని కుండబద్ధలు కొట్టేలా మాట్లాడటం వైరల్‌గా మారింది. పోస్టుమార్టంను వీడియో రికార్డు చేయాల్సి ఉన్నదని, కానీ దవాఖాన అధికారులు రికార్డు చేయాల్సిన అవసరం లేదని, కేవలం ఫొటోలు తీస్తే చాలని అన్నారని, దీంతో తాము వారు చెప్పినట్టు చేశామని పేర్కొన్నారు.
హత్యకు, ఆత్మహత్యకు చాలా తేడా!
హత్యకు, ఆత్మహత్యకు చాలా తేడా ఉం టుందని రూప్‌కుమార్ షా అన్నారు. మృతదేహాన్ని చూసిన వెంటనే అది హత్యా లేక అత్మహత్య అనేది అప్పటికప్పుడు చెప్పేయవచ్చని పేర్కొన్నారు. ‘సుశాంత్ మెడపై గాయాలు ఉన్నాయి, హత్యలా కనిపించింది. శరీరంపై పిడిగుద్దుల కారణంగా అయిన గాయాల గుర్తు లు ఉన్నాయి. ఆత్యహత్య చేసుకొనే వ్యక్తికి ఆ స్థాయిలో గాయాలు కావు’ అని అన్నారు. సుశాంత్ మరణం వెనుక నిజం బయటకు రాదనే విషయం తనకు తెలుసునని, అందుకే మీడియా ముందుకు రావాలని అనుకొన్నాన ని తెలిపారు. మృతిపై పలు ఏజెన్సీలు దర్యాప్తు చేసినప్పటికీ, నిజం బయటకు రాలేదని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. 2020, జూన్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న తన అపార్ట్మెంట్లో విగతజీవుడై కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా వివాదాలు చెలరేగాయి. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం దుమారం రేపింది.