న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈడీ అరెస్టును ప్రశ్నిస్తూ ఆయన సుప్రీంలో పిటీషన్ వేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం తనకు బెయిల్ ఇవ్వాలని ఆ పిటీషన్లో కోరారు. ఆ పిటీషన్‌పై ఇవాళ కూడా విచారణ జరిగింది. ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. దీంతో సోరెన్ తరపున వాదించిన సిబల్ .. ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
జస్టిస్ దీపాంకర్ దత్త, సతీష్ చంద్ర శర్మలతో కూడి ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. రెండు వేర్వేరు పిల్స్ వేయడం వల్ల సోరెన్ పిటీషన్‌ను తిరస్కరించినట్లు కోర్టు చెప్పింది. రాంచీ ట్రయల్ కోర్టు ముందు విచారణకు హాజరైన విషయాన్ని సోరెన్ తన తాజా పిటీషన్లో వెల్లడించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో.. సిబల్ ఆ పిల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. అక్రమ రీతిలో భూ మార్పిడి చేసినట్లు సోరెన్‌పై ఫిర్యాదులు ఉన్న విషయం తెలిసిందే.