Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పరిమితంగా ఉన్న వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడాన్ని ఆహ్వానించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుపరిపాలనలో భాగంగా ప్రపంచమంతటా వివిధ దేశాలు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను (పీపీపీ విధానాన్ని) ప్రోత్సహిస్తున్నాయన్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. ఫార్ములా-4 రేసులతోపాటు ఇతర మోటర్ స్పోర్ట్స్‌ను తమిళనాడు ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేయరాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
2023 డిసెంబర్ 8, 10 తేదీల్లో చెన్నై నగరంలో ఫార్ములా-4 రేసులను నిర్వహించబోతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు 2023 నవంబర్ 2న నోటిఫికేషన్ జారీ చేసింది. రేసింగ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్) అనే ప్రైవేటు సంస్థతో కలిసి తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ (ఎస్‌డీఏటీ) ఈ రేసును నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇరువురి మధ్య 2023 ఆగస్టులో ఎంవోయూ కుదిరినట్టు వివరించింది. ఈ ఎంవోయూ మేరకు ఫార్ములా-4 రేసులను నిర్వహించారు. మూడేండ్ల వ్యవధి కోసం కుదిరిన ఎంవోయూ ప్రకారం ఆర్పీపీఎల్ తన బాధ్యతగా రూ.202 కోట్లను వ్యయం చేయనుండగా, లైసెన్స్, ఆపరేషన్స్ ఫీజు, రోడ్లు, ఇతరత్రా అవసరాల కోసం ఎస్‌డీఏటీ రూ.42 కోట్లు వెచ్చించాల్సి ఉంది. అయితే చెన్నైలో ఫార్ములా-4 రేసులు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఫార్ములా-4 రేసుల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, భద్రతాపరమైన అంశాలు తలెత్తుతున్నాయని, ధ్వని కాలుష్యం ఏర్పడుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేటుగా నిర్వహించే కార్యక్రమానికి ప్రజాధనాన్ని వెచ్చించడంలో పారదర్శకత లోపిస్తున్నదని ఆరోపించారు. దీంతో డిసెంబర్లో జరగాల్సిన రేసులు వాయిదాపడ్డాయి.
దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కిందటేడాది ఫిబ్రవరి 19న మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. రేసుల నిర్వహణకు హైకోర్టు అనుమతినిచ్చినప్పటికీ పలు షరతులను విధించింది. తమిళనాడు ప్రభుత్వం వెచ్చించిన రూ.42 కోట్లను, భవిష్యత్తులో నిర్వహించబోయే రేసుల కోసం అడ్వాన్స్ డిపాజిట్‌గా చెల్లించిన రూ.15 కోట్లను ఆర్పీపీఎల్ తిరిగిచ్చేయాలని ఆదేశించింది. రానున్న సంవత్సరాల్లో ఈ రేసులను ప్రభుత్వమే నిర్వహించాలని కూడా సూచించింది. ఇలా నాలుగు ఆదేశాలను ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆర్పీపీఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ప్రపంచమంతటా పలు దేశాలు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తున్నాయి. సుపరిపాలనలో భాగంగా పీపీపీ విధానాన్ని సమర్థించాల్సిందే. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో భాగంగా కుదిరిన ఎంవోయూలోని నిబంధనల్లో, అదీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకోవడం.. న్యాయవ్యవస్థ తన పరిధిని దాటడమే అవుతుంది.