న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: మధ్యప్రదేశ్‌లో దెబ్బతిన్న శ్రీమహావిష్ణు విగ్రహ పునరుద్ధరణను కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. సీజేఐ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా ఉన్నాయంటూ కొందరు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌ని తోసిపుచ్చిన సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశం భారత పురావస్తు పరిశోధనా శాఖ(ఏఎస్ఐ) పరిధిలోనిదని, ఆ మహావిష్ణువే ఏదో రకంగా జోక్యం చేసుకోవాలని మొరపెట్టుకోవాలని పిటిషనర్‌కి సూచించింది. ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. ఏదో ఒకటి చేయమని ఆ దేవుడికే మొరపెట్టుకోండి. విష్ణుమూర్తికి పరమ భక్తుడినని మీరే చెప్పుకున్నారు. ఇక ఆ దేవుడినే ప్రార్థించండి అని పిటిషనర్ రాకేశ్ దలాల్‌కి ధర్మాసనం సూచించింది.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఖజూరహో ఆలయ సముదాయంలో భాగమైన జవారీ ఆలయంలో ధ్వంసమైన 7 అడుగుల శ్రీమహావిష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విగ్రహ పునరుద్ధరణ పురావస్తు పరిరక్షణగా మాత్రమే పరిగణించరాదని, ఇది మత విశ్వాసాలకు సంబంధించిందని పిటిషనర్ వాదించారు. మంగళవారం సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలు బహిర్గతం కావడంతో సోషల్ మీడియాలో సీజేఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీజేఐ గవాయ్‌ని అభిశంసించాలన్న డిమాండు కూడా వైరల్ అయింది. సీజేఐ వ్యాఖ్యలు ప్రజల మత మనోభావాలను గాయపరిచినట్లు కొందరు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతూ పలువురు న్యాయవాదులు సీజేఐకి లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి తీవ్రంగా పరిగణించి ప్రజల మత విశ్వాసాల పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరో న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐకి ఓ బహిరంగ లేఖ రాస్తూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వివరణ ఇవ్వాలని సీజేఐని కోరారు.