Superbug | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఔషధాలకు లొంగని సూపర్‌బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వల్ల రానున్న 25 ఏండ్లలో దాదాపు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నదని ఓ అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టకపోతే మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్పష్టం చేసింది. సూపర్‌బగ్స్ వల్ల తలెత్తే పర్యవసానాలను అంచనా వేసేందుకు జరిపిన ఈ అధ్యయన వివరాలు సోమవారం ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వైద్య రంగంలో ప్రపంచం ఎంతో పురోగతి సాధించినప్పటికీ, గత 3 దశాబ్దాల్లో ఐదేండ్లలోపు వయసున్న పిల్లల మరణాలను 50 శాతానికిపైగా తగ్గించగలిగినప్పటికీ 1990-2021 మధ్య కాలంలో సూపర్‌బగ్స్ వల్ల ఏటా 10 లక్షల మందికిపైగా మరణించినట్టు పరిశోధకులు ఈ అధ్యయనంలో తేల్చారు. వైద్య రంగంలో సాధించిన విజయాలు ఇన్ఫెక్షన్ల నియంత్రణకు, నివారణకు తోడ్పడినప్పటికీ సూపర్‌బగ్స్ ఎప్పటికప్పుడు శక్తిసామర్థ్యాలను పెంచుకుంటూ మానవాళికి సవాళ్లు విసురుతూనే ఉన్నాయని తెలిపారు.