సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 20:25:02

మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌!

మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే సుమిత్రాదేవి క‌స్డేక‌ర్ కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా త‌న రాజీనామా లేఖ‌ను ప్రొటెం స్పీక‌ర్ రామేశ్వ‌ర్ శ‌ర్మ‌కు అంద‌జేశారు. ఆయ‌న వెంట‌నే ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపారు. అనంత‌రం సుమిత్రాదేవి భోపాల్‌లోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లి మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ బీజేపీ కండువా క‌ప్పి సుమిత్రాదేవిని పార్టీలోకి ఆహ్వానించారు. శుక్ర‌వారం సాయంత్రం ఈ ప‌రిణామాల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే సుమిత్రాదేవి రాజీనామాకుగ‌ల‌ కార‌ణాలు తెలియ‌రాలేదు. కాగా, గ‌త ఫిబ్ర‌వ‌రిలో యువ‌నేత జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ పార్టీని చీల్చి 22 మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి బీజేపీలో చేరారు. 

దీంతో అప్ప‌ట్లో క‌మ‌ల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోయి, శివ‌రాజ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎమ్మెల్యే సుమిత్రాదేవి రాజీనామా చేయ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌య్యింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo