బెంగుళూరు: బెంగుళూరులోని యలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా ఎయిర్ షో జరుగుతున్నది. అయితే తొలిసారి ఎయిర్ షోలో.. ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల(Fifth Generation Fighter Jets)ను ప్రదర్శించారు. అవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-35 లైటనింగ్-2, రష్యాకు చెందిన సుఖోయ్-57 అయిదో జనరేషన్ యుద్ధ విమానాలు ఆ ఏరో ఇండియాషోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. స్టీల్త్ ఫైటర్లకు చెందిన ఓ ఫోటో ఇప్పుడు అందర్నీ మంత్రముగ్దుల్ని చేస్తున్నది.
యుద్ధ విమానాల్లో ఫిఫ్త్ జనరేషన్ విమానాలను అత్యంత అత్యాధునిక యుద్ద విమానాలుగా గుర్తిస్తారు. ప్రపంచ రక్షణ దళంలో వీటిని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. యలహంక బేస్ నుంచి సుఖోయ్-57 ఫెలన్ యుద్ధ విమానం టేకాఫ్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఏరోబాటిక్ విన్యాసం చేశాడు ఆ విమాన పైలెట్. వర్టికల్ పొజిషన్లో అతను యుద్ద విమానాన్ని ఫ్లై చేశాడు.
#WATCH | Bengaluru, Karnataka: Su-57 from Russia performs manoeuvres at #AeroIndia2025, enthralling the onlookers. pic.twitter.com/YpGfM88164
— ANI (@ANI) February 10, 2025
అమెరికాకు చెందిన ఫైటర్-35 లైటనింగ్ 2తో పాటు బీ-1బీ లాన్సర్ సూపర్సోనిక్ స్ట్రాటజిక్ బాంబర్‌ను కూడా ఏయిర్ షోలో ప్రదర్శించనున్నారు. సుఖోయ్ యుద్ధ విమానంలోని పైలెట్ యలహంక ఎయిర్ బేస్ పైనుంచి ఓ సెల్ఫీ దిగాడు. కాక్‌పిట్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ విమానంలో ఎయిర్ బేస్ ఎలా కనిపిస్తుందో ఆ ఫోటోలో చూపించాడు.
అమెరికా, రష్యా దేశాలు తమ రక్షణ ఉత్పత్తుల్ని ఆసియా దేశాల్లో అమ్మేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ షోలో తమ విమానాలను ప్రదర్శించాలన్న ఉత్సుకతను కూడా ఆ అగ్రదేశాలు ప్రదర్శిస్తున్నాయి.
మిత్ర దేశాలకు తమ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానం సుఖోయ్-57ఈ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోసోబోరన్ ఏజెన్సీ ప్రతినిధి అలెగ్జాండర్ మైఖీవ్ తెలిపారు. ఆసియా-పసిఫిక్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సుఖోయ్-57ఈకి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఎఫ్-35ఏ స్టీల్త్ ఫైటర్‌తో పాటు అప్‌గ్రేడ్ ఎఫ్-16 ఫైటర్ విమానాల విన్యాసాలను అమెరికా రద్దు చేసినట్లు తెలుస్తోంది.