ఎర్నాకుళం: సామాజిక మాధ్యమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయనేందుకు నిదర్శనంగా మరో ఘటన జరిగింది. అంధుడైన గురువు చుట్టూ చేరి కొందరు కాలేజీ విద్యార్థులు ఆయనను ఆటపట్టించారు. వెకిలి చేష్టలతో హేళన చేశారు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ కాలేజీలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకుడు అంధుడు. ఆయన అదే కాలేజీలో చదువుకుని అధ్యాపకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ఓ తరగతి గదిలో పాఠం చెబుతుండగా ఓ ఆరుగురు విద్యార్థులు ఆయన చుట్టూ చేరి అల్లరి చేశారు. ఆయన దృష్టి లోపాన్ని దెప్పి పొడుస్తూ అవమానకరంగా మాట్లాడారు.
ఆయనకు కళ్లు కనిపించవు కాబట్టి వెకిలి చేష్టలు చేశారు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్గా మారింది. విద్యార్థుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో ఆ ఘటనకు బాధ్యులైన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై బాధిత అధ్యాపకుడు మాట్లాడుతూ.. ‘నేను ఒక గంట బోధన కోసం రెండు గంటలు సిద్ధమై తరగతి గదికి వస్తే విద్యార్థులు ఆ విధంగా ప్రవర్తించారు. ఆ వీడియో చూసి నా స్నేహితులు, బంధువులు బాధపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజీ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకుంటా’ అన్నారు.