న్యూఢిల్లీ : రిఫ్రిజిరేటర్లు వంటి ఉపకరణాలకు తప్పనిసరిగా ఎనర్జీ ఎఫిషియెన్సీ స్టార్ లేబులింగ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నిబంధన నేటి (గురువారం) నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, ఎల్పీజీ గ్యాస్ స్టవ్‌లు, కూలింగ్ టవర్లు, చిల్లర్స్, డీప్ ఫ్రీజర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, గ్రిడ్‌తో అనుసంధానమైన సోలార్ ఇన్వర్టర్లకు ఈ లేబులింగ్ తప్పనిసరి.
గతంలో ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్లు, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు, డీప్ ఫ్రీజర్లు, ఫ్లోర్ స్టాండింగ్ టవర్, కార్నర్ ఏసీ, కలర్ టెలివిజన్లు, అల్ట్రా హై డెఫినిషన్ టెలివిజన్లు వంటి ఉపకరణాలపై స్టార్ లేబులింగ్ స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి అవకాశం ఉండేది. గతంలో స్టార్ లేబులింగ్ తప్పనిసరి అయిన ఉపకరణాల్లో, రూమ్ ఎయిర్ కండిషనర్స్, ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్స్, స్టేషనరీ స్టోరేజ్ టైప్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్, వాషింగ్ మెషీన్లు, ట్యూబులార్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్, సెల్ఫ్ బాలస్టెడ్ ఎల్ఈడీ ల్యాంప్స్ ఉన్నాయి. కాగా, తాజా నిబంధనలతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.