లాస్ఏంజెలెస్, అక్టోబర్ 4: ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష డెలివరీ వాహనం (Space Delivery Vehicle) సిద్ధమైంది. ఇది భూమిపై ఏ ప్రాంతానికైనా గంటలో సామగ్రిని తీసుకు రాగలదు. తన ఆర్క్ వాహనం (Arc Space Cargo) క్లిష్టమైన సరుకును మోసుకు వెళ్లగలదని, రన్వేలు లేకుండా ల్యాండ్ చేయగలదని, యూఎస్ మిలిటరీకి హైపర్ సోనిక్ పరిశోధన వేదికగా పని చేయగలదని లాస్ఏంజెలెస్లో ఉన్న యువ అంతరిక్ష, రక్షణ సంస్థ ఇన్వర్షన్ వెల్లడించింది. తన మొదటి ప్రధాన అంతరిక్ష డెలివరీ నౌక ఆర్క్ను ఆవిష్కరించింది. ఈ రీ ఎంట్రీ వాహనం 500 పౌండ్ల మిషన్-క్రిటికల్ కార్గోను కక్ష్య నుంచి భూమిపై ఉన్న ఏ ప్రాంతానికైనా గంట కన్నా తక్కువ సమయంలో చేరవేసేలా రూపొందించినట్టు కంపెనీ తన ఫ్యాక్టరీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ నౌక గురించి వెల్లడించింది.
2021లో కంపెనీని ప్రారంభించిన సహ వ్యవస్థాపకులు ఫియాచెట్టి, ఆస్టిన్ బ్రిగ్స్ ఆర్క్ను కొత్త రకమైన లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్‌గా ప్రదర్శించారు. అంతరిక్ష నౌక ఆర్క్ 8 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో సుమారు పెద్ద టేబుల్ టాప్ అంత ఉంటుంది. మెడికల్ కిట్ల నుంచి డ్రోన్ల వరకు దేనినైనా బట్వాడా చేసేలా దీనిని రూపొందించారు. ఇది 621 మైళ్ల క్రాస్ రేంజ్ కలిగి ఉంటుంది. దిగే ముందు విశాలమైన ప్రాంతాల్లో తిరగడానికి వీలు కల్పిస్తుంది. రన్‌వే అవసరం లేకుండా ఇది ప్యారాచూట్ కింద ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ తర్వాత రక్షణ గేర్ లేకుండా సైనికులు దీనిని సురక్షితంగా నిర్వహించవచ్చునని నిర్వాహకులు తెలిపారు.