Delhi Govt On Pollution | దేశ రాజధాని హస్తినలో కాలుష్యం నియంత్రణ కోసం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇక నుంచి వాహనచోదకులు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (పీయూసీ) సమర్పిస్తేనే పెట్రోల్ లేదా డీజిల్ పోయాలన్న నిబంధన తప్పనిసరి చేయనున్నది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కోరింది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఢిల్లీలో కాలుష్యం వ్యాపింపజేసే వాహనాలను నడుపకుండా చర్యలు తీసుకోవచ్చునని రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చే వీలు కలుగుతుందన్నారు. పర్యావరణశాఖ సలహాదారు రీనా గుప్తా మాట్లాడుతూ ఇంధనం అవసరమైన వాహన చోదకులు పీయూసీ సర్టిఫికెట్ సమర్పిస్తేనే పెట్రోల్ లేదా డీజిల్ పోస్తారన్నారు. ఆ సర్టిఫికెట్ నకిలీదని తేలితే బంకులోనే చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
ఇటీవలే ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల ఒకటో తేదీలోగా 10 ఏండ్ల దాటిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఆ వాహనాల రిజిస్ట్రేషన్‌కు వీలుగా ఎన్వోసీ జారీ చేస్తామన్నది. 15 ఏండ్లు నిండిన పెట్రోల్ వాహనాలకూ ఇదే నిబంధన వర్తిస్తుందని ఢిల్లీ సర్కార్ తెలిపింది.