Sonam Wangchuk : ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ప్రయత్నించిన సీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ తీరుకు నిరసనగా తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్‌చుక్ ప్రకటించారు. తన నిరాహార దీక్ష విరమించాలంటే రెండు డిమాండ్లు నెరవేర్చాలని ప్రకటించారు. మిలియన్ మార్చ్‌కు బయల్దేరిన సీజేపీ ఉద్యమకారులు.. పార్లమెంట్ ఎంపీలను కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు.
లేదా తాను ఆస్పత్రిలో ఉద్యమకారులను కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వాంగ్‌చుక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ ఉద్యమకారులు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. పోలీసులు జరిపిన భాష్పవాయువు ప్రయోగం, లాఠీఛార్జీలలో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. ఈ అంశంపై సోనమ్ స్పందించారు. 23వ రోజు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నా.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. దీనికి నిరసనగా నిరాహార దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నా. ఉద్యమకారులు సంసద్ భవన్లో పార్లమెంటేరియన్లను కలిసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను. లేదా ఉద్యమకారుల్ని నేను ఆస్పత్రిలో అయినా కలిసేందుకు అనుమతివ్వాలి. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రిని జవాబుదారుడిని చేస్తుందని నేను భావిస్తున్నా. రెచ్చగొట్టేలా ప్రవర్తించినప్పటికీ, శాంతియుతంగా ఆందోళన చేసిన యువత తీరు నన్ను కదిలించింది. ఉద్యమకారులు పార్లమెంటేరియన్లను కలిసేందుకు అనుమతించడం ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం శాంతియుతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
ఈరోజులాగే రేపు కూడా యువత ఇదే స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలియజేస్తారని ఆశిస్తున్నా అంటూ సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. మరోవైపు సీజేపీ నేతలు కేంద్ర మంత్రి జేపీ నద్దాను కలిశారు. తమ డిమాండ్లను ఆయనకు వివరించారు.